Wednesday, June 21, 2006

తెలుగు సినిమా హీరోలు, అభిమానులు, ఇతర పాత్రలూ

Anil
తెలుగు వారం సినిమా అభిమానులం! ఏదో రకంగా సినిమా మన జీవితాన్ని తడమని రోజే ఉండటం లేదు. సినిమా అంటే "హీరో", హీరోయే సినిమా అయిపోయిన కాలమిది. మన హీరోలకు అపరిమితమైన ప్రాముఖ్యత ఉంది. కానీ, వాళ్ళు నిజంగా హీరోలేనా?

హీరోలు: మన తెలుగు సినిమా హీరోల పరిస్థితి చూస్తుంటే జాలేస్తోంది. గానుగకు కట్టేసిన ఎద్దు ఎలా తిరుగుతుందో వీళ్ళ సినిమా జీవితాలూ అలాగే అయిపోయాయి. ఇమేజీ అనే గానుగకు కట్టేసిన ఎద్దులు వీళ్ళు. (అయితే తెలుగు సినిమా పరిస్థితి మరింత జాలిగొలుపుతుంది.. అది ఈ గానుగెద్దుల చుట్టూ తిరుగుతోంది) ఎరుపెక్కిన కళ్ళూ, పవర్‌ఫుల్ (చంపుతా, నరుకుతా లాంటి) డైలాగులూ, ఓ నలభై యాభై మంది కండలు తిరిగిన వస్తాదులను ఒంటిచేత్తో నలగ్గొట్టడం, హీరోయిన్ తో చేసే రికార్డు డ్యాన్సులు .. ఇవి ఉంటేనే వాళ్ళ సినిమాలు ఆడతాయి. ఏ మాత్రం సహజత్వం ఉన్నా ఆడవు. (ఈ మధ్య ఎలాంటివైనా ఆడటం లేదులెండి! అదొక మంచి మార్పు.) . తమ సినిమాలకు వీళ్ళు చెప్పినవారే దర్శకుడు, సంగీత దర్శకుడు, కథకుడు, ఇతర నటులూ, సాంకేతిక నిపుణులూను. వీళ్ళతో సినిమాలు తీసి, వీళ్ళను పోషిస్తున్న నిర్మాతలకు వీళ్ళకున్న ప్రాముఖ్యతలో శతాంశం కూడా దక్కుతున్నట్టనిపించదు.

హీరోయినులు: తెలుగు సినిమాల్లో హీరోయిను ఓ ఆటబొమ్మ, అంగడి బొమ్మ! హీరోయిన్ల ప్రాముఖ్యత గురించి జెమినీ ఇంటర్వ్యూలో శేఖర్ కమ్ముల వ్యాఖ్య చూడండి. మామూలుగా అడిగే తెలివి తక్కువ ప్రశ్నలతో పాటు ఇలా అడిగాడు ఇంటర్వ్యూ చేసే వ్యక్తి.. మీ సినిమాల్లో హీరోయినుకు ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది ఎందుకు? అని. అదేం లేదు ప్రత్యేక ప్రాముఖ్యత ఏమీ ఉండదు, మన సినిమాల్లో హీరోయినుకు పాటల్లో తప్ప ఉనికే ఉండదు. నా సినిమాల్లో కాస్త మామూలు ప్రాధాన్యత ఉండేటప్పటికి మీకు అలా అనిపిస్తున్నట్లుంది అన్నారు, శేఖర్.

విదూషకులు: ఇంతటి ప్రాముఖ్యత ఉన్న ఈ పవర్‌ఫుల్ హీరోలను వెధవాయిలను చేసి ఓ ఆటాడిస్తూ, తమ పబ్బం గడుపుకునే వర్గం ఒకటుంది మన పరిశ్రమలో. దాని పేరు విదూషక వర్గం . కమెడియన్లన్నమాట (అందరూ కాదు.., కానీ చాలామంది)! నటనాశక్తి పరంగా, ప్రతిభ పరంగా వాళ్ళు హీరోలకెందుకూ తీసిపోరు. అసలు వాళ్ళకంటే వీళ్ళే మెరుగు. ఈ విదూషకులు హీరోలను పొగడుతూ మాట్లాడే తీరు చూస్తుంటే మనకాశ్చర్యం వేస్తుంది. ఎందుకు వీళ్ళింతలా పొగుడుతున్నారు, ఏంటి వీళ్ళకీ ఖర్మ అని అనిపిస్తుంది. నిజానికది పొగడ్త కంటే ఎన్నో రెట్లు ఎక్కువ. మామూలు మానవుడెవడైనా అంతటి పొగడ్తలను భరించలేడు. కానీ .. ఈ విదూషకులు వీళ్ళను తమ నాలుకల కొనలమీద నిలబెట్టి ఆటాడిస్తున్నారనీ, పొగడ్తలతో వాళ్ళను సంతోషపెట్టి తమ పనులను చేయించుకుంటున్నారనీ నిదానంగా మనకర్థమవుతుంది .

హీరోభిమానులు: వాళ్ళ పొగడ్తలు నిజమేనని ఆ హీరోలు నమ్ముతారా అంటే.. సందేహమే! హిపోక్రసీకి పరాకాష్ఠ అయిన సినిమా లోకంలో ఎవడి మనసులో ఏముందో మరోడికి తెలీదు. పెదాలపై ఉన్న మాట హృదిలో ఉందని చెప్పలేం. కానీ ఇవి నిజమేనని నమ్మే వర్గం ఒకటుంది.. అదే వీరాభిమానుల వర్గం. చదువూ, సంధ్యల్ని గాలికొదిలేసి, ఉద్యోగం సద్యోగం చూసుకోకుండా ఈ హీరోల చుట్టూ తిరిగే వర్గమిది. తమ హీరో కోసం డబ్బులేం ఖర్మ, ప్రాణాలూ ధారపోస్తారు వీళ్ళు. హీరోలు, ఇతర నటులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు, పంపిణీదారులు, ప్రదర్శకులు, హీరోభిమానులు, మామూలు ప్రేక్షకులు భాగంగా ఉన్న తెలుగు సినిమా వ్యాపార వలయంలో అందరికంటే అమాయకులు హీరోభిమానులే! మామూలు ప్రేక్షకులు టిక్కెట్టు డబ్బులు మాత్రమే పెడతారు, అదీ సినిమా బాగుందంటేనే చూస్తారు. అభిమానులో.. సినిమా ఎంత చెత్తదైనా చూస్తారు (లేకపోతే వాళ్ళేం అభిమానులు?) సినిమాకూ హీరోకూ ప్రచారం కోసం పోస్టర్లూ, కటౌట్లూ, కరపత్రాలూ ఇలాంటివెన్నో! పైగా, సినిమా గురించి తమ తమ సంఘాల్లో చర్చలూ, గోష్ఠులు!

అభిమాన భారం: సినిమా విడుదలైన రోజున ఎగబడి చూసేది ఎవరు? హీరోభిమానులే! విడుదలైన మొదటి రోజుల్లో టిక్కెట్టు డబ్బులు పెంచడం మొదలెట్టారామధ్య, లాభం ఎవరికి? భారం ఎవరిపైన? హీరోభిమానులపై హీరోల అభిమానమిదీ!

0 Comments:

Post a Comment

<< Home