ఈ దొంగ శ్రీవేంకటేశుని చూసారా
Anil
సాక్షాత్ శ్రీవేంకటేశుని, శేషశయన విష్ణుమూర్తిని దూషించగలమా చెప్పండి..!? ఈ గోలేమిటంటున్నారా..!!!!! అయితే మీరు ఈటీవీ చూడరాండీ..!? చూస్తే, అందులో కాసెట్లమ్ముకునే ఎడ్వర్టైజ్‌మెంట్లు చూసేఉండాలే! చిరునవ్వుతో, బూరెబుగ్గలతో, అపార వినయ విధేయతల బరువువలన కొద్దిగా వంగిన వీపుతో, చిరుబొజ్జతో, ముద్దపప్పులా, మొద్దబ్బాయిలా, ఎం..థో సరళంగా కనిపించే ఈ వెంకటేశ్వర స్వామిని గాని లేదా విష్ణుమూర్తిని గాని చూసిఉండేవారే! ఆయన్ని చూస్తుంటే, నాకెందుకో ఈటీవీ అధినేత సుమన్ గుర్తొస్తూ ఉంటాడు. సుమన్ కు వెంకటేశ్వరుడికి ఇంత దగ్గరి పోలికలా..! లేక సుమనే వెంకటేశుడా..లేక సుమన్ భగవంతుడి పదకొండో అవతారమా..? ఏమో...!
ఇక్కడో చిన్న విషయం..ఎవరి మీద పాటలు రాసినా పరవాలేదు గానీ, రుద్రభూపతియైన శివుడిపై మాత్రం పాటలు రాయవద్దని "శ్రీమాన్ సుమన్ స్వామి"కి నా విజ్ఞప్తి. మొలకో చర్మం చుట్టుకుని, బూడిద పూసుకున్న సుమన్ని చూడలేమేమోనని నా ఉద్దేశ్యం, అంతే! మన వేడుకోలును ఆయన పట్టించుకోక (పట్టించుకుంటాడనే నమ్మకం నాకు లేదు. ఛానెలు ఆయనదే కదా. పైగా, అసలు చిక్కల్లా అదేనాయె) అలాంటిదే జరిగితే, ఆ కాసెట్టుకు ఎడ్వర్టైజ్‌మెంటు విడుదల చేసేలోపే, మొత్తం కాసెట్లన్నిటినీ కొని 'పారెయ్యడానికి' యావదాంధ్రదేశం సిద్ధంగా ఉండాలని పిలుపునిస్తున్నాను.